Friday, 4 May 2018

చరిత్రలో తొలిసారి దేశవ్యాప్తంగా రైళ్లకు కొత్త పట్టాలు: కేంద్ర ప్రభుత్వం

చరిత్రలో తొలిసారి దేశవ్యాప్తంగా రైళ్లకు కొత్త పట్టాలు: కేంద్ర ప్రభుత్వం
* మొదటిసారిగా పూర్తిస్థాయిలో ట్రాక్‌ పునరుద్ధరణ
* చరిత్రలో తొలిసారి భారీ కసరత్తు.
* పెరగనున్న రైళ్ల వేగం గంటకు 190కి.మీ.
************************************************************************
చరిత్రలో తొలిసారిగా భారతీయ రైల్వే భారీ కసరత్తు మొదలుపెట్టింది. రైల్వే ట్రాక్‌ను సమూలంగా మార్చే పనిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో మన దేశంలోనూ రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా దశలవారీగా 65,000 కి.మీ. (ఇందులో దక్షిణ మధ్య రైల్వే 6,200 కి.మీ.) ట్రాక్‌ను పూర్తిగా మార్చనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.800 కోట్లతో 300 కి.మీ. మేర ట్రాక్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుదిరితే లక్ష్యాన్ని మించి పనులు చేపట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం కొత్త ట్రాక్‌ కనిపించనుంది. కేవలం పట్టాలు మాత్రమే కాకుండా.. వాటి దిగువన ఉండే స్లీపర్లను కూడా కొత్తవి ఏర్పాటు చేస్తారు. గతంలోని ఇనుము, చెక్క స్లీపర్లను తొలగించి కాంక్రీట్‌ స్లీపర్లు బిగిస్తున్నారు. వాటితోపాటు క్లాంప్స్, క్లిప్స్, స్విచ్చెస్‌ వంటివన్నీ కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల లూప్‌లైన్లు, యార్డుల్లోని మెరుగైన పట్టాలను తొలగించి వేరే చోట ఏర్పాటు చేస్తున్నారు.
తగ్గనున్న ప్రమాదాలు
పట్టాలు అవసాన దశకు చేరుకోవటంతో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి పట్టా విరిగి రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. కొత్త పట్టాల ఏర్పాటుతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం 250 మీటర్ల పొడవున్న పట్టాలను ఏర్పాటు చేసి వెల్డింగ్‌ ద్వారా వాటిని జోడిస్తున్నారు. ఎండాకాలంలో పట్టాల వ్యాకోచం వల్ల అతుకులు ఊడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కిలోమీటరున్నర నుంచి రెండు కిలోమీటర్ల పొడవుండే పట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అత్యాధునిక పరిజ్ఞానంతో జోడిస్తున్నారు. దీంతో వ్యాకోచించే సమయంలో ఏర్పడుతున్న సమస్యలు ఇక కనిపించవు.
ప్రస్తుతం ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వేగాన్ని తట్టుకుని ప్రయాణిస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక బోగీపై మరోటి ఎక్కకుండా ఉంటాయి.